– కొద్దిరోజులకే ధ్వంసమైన వైనం
– చీకటి పడితే ప్రయాణం ప్రమాదమే
– ప్రాణాలు పోతే గాని స్పందించని నాయకులు, అధికారులు
– సంబంధిత శాఖ నిర్లక్ష్యం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మరియు బీర్కూర్ మండలాల పరిధిలో మైలారం – మిర్జాపూర్, దుర్కి – మిర్జాపూర్ అదేవిధంగా మిర్జాపూర్ నుండి రైతు నగర్ గ్రామానికి వెళ్లే రోడ్లు వీరాపూర్ (దుబ్బ) వద్ద ధ్వంసమై ప్రమాదకరంగా మారాయి. ఈ విషయంపై గ్రామానికి చెందిన యువకులు శ్రీనివాస్ మరియు రవీందర్ మాట్లాడుతూ.. ఈ రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రజలకు వణుకు పుడుతుందని అన్నారు. చీకటి పడితే ఈ రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా ఉందని వారు తెలిపారు.

నిత్యం ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు జరిగి గాయాల పాలైన సంఘటనలు చాలా ఉన్నాయని.. స్థానికులు ప్రతిరోజు పంట పొలాలకు మరియు బాన్సువాడ పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారి కావడం వల్ల విద్యార్థులు, వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా దుర్కి -మిర్జాపూర్ గ్రామాలకు అనుసంధానంగా వేయవలసిన రోడ్డు గతంలో స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతులమీదుగా శంకుస్థాపన జరిగినప్పటికీ.. తర్వాత రోడ్డు పనులు నిలిచిపోయాయని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి మండలాల వ్యాప్తంగా పలుచోట్ల రోడ్లు ధ్వంసం అయిపోయినప్పటికీ వాటిని పట్టించుకునే నాధులు లేరన్నారు.. రోడ్లు భవనాల శాఖ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి రోడ్లు మరమ్మత్తులు చేయించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








