– అక్రమ ఆస్తులు సంపాదించినట్లు రుజువు చేస్తే మండల ప్రజలకు దారాదత్తం చేస్తా
– నా పై చేసిన ఆరోపణలు నిరూపిస్తే శిరోఖండనానికి కూడా సిద్ధం
– మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార సభలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను, అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ ఆదివారం రోజు బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో గల తన నివాసంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీర్కూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను తిప్పి కొట్టారు. మొరం, ఇసుక దందాలో అక్రమంగా సంపాదించానని.. బైంసాలో 70 ఎకరాలు వ్యవసాయ భూములు ఉన్నాయని.. అక్రమ సంపాదన ప్రజలకు ఖర్చు పెడుతున్నానని ఆరోపణలు చేశారన్నారు.తనతో పాటు కుటుంబ సభ్యులందరికీ కలిపి 39 ఎకరాలు మాత్రమే వ్యవసాయ భూమి ఉందని వివరణ ఇచ్చారు. ఒకవేళ వారు నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు మాత్రమే మొరం, ఇసుక వాడామని, అక్రమంగా సంపాదించినట్టు రుజువు చేయాలన్నారు. రూ. 4.18 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, బిల్లులు ఇప్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రూ. 5 కోట్లు అప్పులు ఉన్నాయని, అప్పుల వివరాలను పాత్రికేయుల ముందు ఉంచారు. రాజకీయాల్లో తాను ఏనాడు డబ్బు ఆశించలేదని, ప్రతి ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపు కొరకు కుటుంబ సభ్యులను సైతం లెక్కచేయకుండా ఎంతో కృషి చేశానన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి తాను ఏనాడు ద్రోహం చేయలేదని వివరించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మందిరంలో తడి బట్టలతో ప్రమాణం చేసి చెప్పడానికి నేను సిద్ధమని సవాల్ విసిరారు. మీరు కూడా మీ ఆస్తుల వివరణ ఇవ్వడానికి సిద్ధమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, పుల్లెన్ బాబురావ్, శ్రీనివాస్, మారుతి, నారాయణ, సాయిలు, సమ్ దాని, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








