V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వం”రైతు భరోసా” ఎగవేతపై నిరసన సెగ …..

SHARE:

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంటల పెట్టుబడి సహాయార్థం బ్యాంకు ఖాతాలలో జమ చేయవలసిన “రైతు భరోసా” డబ్బుల ఎగవేతపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన సెగ మొదలైంది. ఇందులో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజు బాన్సువాడ పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అందరూ కలిసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు మోచే గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వం” రైతు భరోసా” డబ్బుల విషయంలో రైతులను ఊరించి ఊరించి చివరికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమక్షంలో ఈ పంటకు రైతు భరోసా డబ్బులు చెల్లించడం కుదరదని దీనిపై సబ్ కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని.. చావు కబురు చల్లగా చెప్పి రైతులను నయవంచన చేశారని అన్నారు. రైతుల ఉసురు మంచిది కాదని.. ప్రభుత్వం ఈ విధంగా చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. “ఎద్దు ఏడ్చిన వ్యవసాయము.. రైతు ఏడ్చిన రాజ్యము”బాగుపడినట్లు చరిత్రలో లేదని గుర్తు చేశారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నైతికంగా బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు భరోసా విషయంపై పునరాలోచన చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా షేక్ జుబేర్ మాట్లాడుతూ కేటీఆర్ ఆదేశాల మేరకు రైతు భరోసా ఎగవేత పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం ఆచరణ సాధ్యం కానీ హామీలతో ప్రజలను మభ్యపెట్టి, ప్రలోభాలకు గురిచేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఇష్టారాజ్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సమయానికి రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాలలో జమ అయ్యేవని తద్వారా రైతులు ఎరువులు ,విత్తనాలు, కూలీలు వంటి వాటిని సమకూర్చుకొని తమ వ్యవసాయాన్ని సక్రమంగా నిర్వహించుకునేవారు అన్నారు. నేడు రాష్ట్రంలో పరిస్థితి గమనించినట్లయితే ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు కానీ.. రైతు రుణమాఫీ, వరి పంటకు బోనస్ డబ్బులు క్వింటాల్ కు రూ.500, ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం మొదలగునవి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని అన్నారు. ప్రభుత్వం రైతు భరోసా పై తమ నిర్ణయం మార్చుకునేంతవరకు రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ తమ పోరాటాన్ని కొనసాగిస్తుందని హెచ్చరించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను గట్టున పెట్టి ఈరోజు “హైడ్రా”మరియు “మూసీ నది ప్రక్షాళన”అంటూ కాలయాపన చేస్తూ సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఈ విషయంపై స్థానిక శాసనసభ్యుడు.. వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు అధిష్టానంతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు గొడిసెల నరసింహులు గౌడ్, టేకుర్ల సాయిలు, చుంచు శేఖర్, మోసిన్, రమేష్ యాదవ్, గంపల శంకర్, కార్యకర్తలు అల్లం గంగారం అల్లం సాయిలు, ఉల్లెంగ విట్టల్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india