????కంపు కొడుతున్న వీధులు
????పారిశుద్ధ్య లోపంతో దోమల స్వైర విహారం
????పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు
V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: గ్రామ సర్పంచ్ ల పాలన కాలం ముగిసిన నాటినుండి పల్లె పాలన పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. ప్రతి గ్రామానికి అందుబాటులో ఉంటూ ప్రజా పాలన నిర్వహించాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారులపై ఉండగా వారు కనీసం పల్లెల వైపు కన్నెత్తి చూడకపోవడం విడ్డూరం. మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీనితో వీధులన్నీ కంపు కొడుతున్నాయి. పారిశుద్ధ్యలోపంతో రహదారులన్నీ కనిపిస్తున్నాయి. బీర్కూర్ మండల కేంద్రంలో గల వీధులన్నీ చెత్తాచెదారంతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఇళ్ల మధ్యనే ఉన్న చెత్త కుప్పలు డంపు యార్డులను తలపించడంతో ప్రజలు వీధుల వెంట నడవాలంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మురికి కాలువలన్ని చెత్తాచెదారంతో నిండిపోయి ఉండడంతో వర్షాకాలం ప్రారంభంలో చేపట్టవలసిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నామమాత్రంగా చేపడుతున్నారనడం లో అతిశయోక్తి లేదు. నిరంతరం గ్రామంలో పర్యటిస్తూ గ్రామ పాలనను పట్టించుకోవాల్సిన పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు మరియు గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ పాలనను గాలికి వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అందించడం కేవలం గృహ ఉపయోగాలకే అన్న విషయం మరిచిపోయి విద్యుత్తును దుర్వినియోగం చేస్తున్నారు అనడంలో పై చిత్రాలే నిలువెత్తు నిదర్శనం. బీర్కూర్ మండల కేంద్రంలో గల ప్రధాన వీధులలో పట్టపగలే విద్యుత్ దీపాలతో దర్శనమివ్వడం చూసి ప్రజలందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. పాలకుల సమయం ముగిసిపోయిన నాటినుండి పంచాయతీ సిబ్బంది ఇష్టా రీతిన వ్యవహరిస్తూ పాలనను పట్టించుకోవడంలేదు. ఒకవైపు నూతనంగా వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతి శాఖను అప్రమత్తం చేస్తూ అధికారులు విధులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఆయన మాటలు పెడచెవున పెడుతూ బీర్కూర్ గ్రామపంచాయతీ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనబడుతుంది. ఇటీవల సంగ గ్రామంలో పారిశుద్ధ్య లోపం మరియు మంచినీటి సమస్యల వలన గ్రామ ప్రజలు విష జ్వరాల బారిన పడి చాలా ఇబ్బందులు పడి వెలుగులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.. సమస్యలు ఉత్పన్నమైతే తప్ప అధికారులు పట్టించుకోకపోవడం విధి నిర్వహణను నిర్లక్ష్యం చేయడమే అవుతుందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టి.. బీర్కూర్ మండల కేంద్రంలో ఆయా వీధుల్లో గల చెత్తకుప్పలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తూ.. నిరంతరం వెలుగుతున్న విద్యుత్ దీపాలను సమయానికి ఆపివేయిస్తూ.. మురికి కాలువలను శుభ్రం చేయించి గ్రామాన్ని పారిశుద్ధ్యంగా ఉండే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








