V1News Telangana

best news portal development company in india

పేరుకే ఆదర్శ పాఠశాల.. వసతులు కరువు

SHARE:

-శిధిలావస్థకు చేరుకున్న పాఠశాల

-రేకుల షెడ్డులో వంట నిర్వహణ, చెట్ల కింద భోజనాలు

-వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న అచ్చంపేట్ ఆదర్శ పాఠశాల

V1 న్యూస్ నిజాంసాగర్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను సకల సౌకర్యాలతో కేరళ ,ఢిల్లీ రాష్ట్రాలలో గల ప్రభుత్వ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దామని గత ప్రభుత్వాలు, ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు వేదికలపై ప్రగల్బాలు ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి అమలు కాక పేద విద్యార్థులకు మెరుగైన వసతులు, విద్య అందని ద్రాక్షగా మారుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా కనుమరుగై పోతున్న తరుణంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు నిర్మించారు. వాటితోపాటు కస్తూర్బా బాలికల పాఠశాలలకు, గురుకుల, ఆదర్శ , నవోదయ , మహాత్మ జ్యోతి పూలే పాఠశాలలకు ప్రత్యేక నిధులు కేటాయించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆర్థిక స్తోమత లేని విద్యార్థులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వివిధ పాఠశాలల్లో చేర్పించి విద్యను అందించే విధంగా ప్రత్యేక ప్రణాళికతో అప్పటి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వల్ల నిరుపేద విద్యార్థులకు సరైన విద్య వసతులు, పౌష్టికాహారం అందక వారు అనారోగ్యం బారిన పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం వైద్యాధికారులు పలు గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు, కస్తూర్బా పాఠశాలలు, ఆదర్శ పాఠశాలల్లో వైద్య పరీక్షలు నిర్వహించగా విద్యార్థులు చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. పౌష్టికాహార లోపం వలన ప్రభుత్వ వసతి గృహాల్లో బాల, బాలికలకు రక్తహీనత, ఐరన్ లోపం మరియు పలు వ్యాధుల బారిన పడుతున్నట్లు తేలింది. ఈ విషయాలపై ప్రభుత్వ అధికారుల ప్రత్యేక పర్యవేక్షణ లేకపోవడం వలన నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. కొన్నిచోట్ల ఆదర్శ పాఠశాలల్లో మరియు వసతి గృహాలలో కుళ్లిపోయిన కూరగాయలు మరియు కాలం చెల్లిన వంట సరుకులతో భోజనం వండి వడ్డించడం వలన విద్యార్థులు ఆ ఆహారాన్ని భుజించి అనారోగ్యాల పాలైన సంఘటనలు వెలుగు చూశాయి, రేకుల షెడ్డులో వంట నిర్వహించడం వలన.. షెడ్డు లో బల్లులు ,ఎలుకలు, విషపురుగులు అధిక సంఖ్యలో నిత్యం సంచరిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. వంట చేయడానికి సరైన వంటశాల, విద్యార్థులు భోజనం చేయడానికి సరైన భోజనశాల లేకపోవడం వలన చెట్ల కింద వడ్డించడం వలన విద్యార్థులు చెట్ల కిందనే కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇది నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ ఆదర్శ పాఠశాల దుస్థితి.. రేకుల షెడ్డులో వంట వండేటప్పుడు బల్లులు, ఎలుకలు, విషపురుగులు, వంటలో పడితే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఏమి కావాలని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చెట్ల కింద భోజనం చేస్తుండగా చెట్లపై కూర్చున్న పక్షులు రొట్టెలు వేయడం వలన విద్యార్థులు భోజనం చేసే సమయంలో వారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్లేట్లో వడ్డించుకున్న అన్నంలో పక్షులు విసర్జించడం వలన అన్నం పారవేసి మళ్లీ వడ్డించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని తెలిపారు. ఈ క్రమంలో ఆదర్శ పాఠశాల ఆవరణలో గల మినీ వాటర్ ట్యాంక్ వలన పాఠశాల పరిసరాలు బురదమయంగా మారుతున్నాయని తెలిపారు. దీనికి తోడు ఆదర్శ పాఠశాల ఆవరణలో రక్షణ చర్యలు పాటించకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం కొనసాగుతున్న ఈ పాఠశాల ఆవరణలో ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయకపోవడం వలన భవిష్యత్తులో విద్యార్థులకు ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ పాఠశాలలో ఇన్ని సమస్యలతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నప్పటికీ ఇప్పటివరకు ప్రజా ప్రతినిధులు గాని అధికారులు గానీ స్పందించకపోవడం శోచనీయమని విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాలకులు వెంటనే స్పందించి పాఠశాల దీనస్థితిని గుర్తించి సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాల్సిందిగా కోరుతున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india