ఎస్సై సెలవు అంటే మాఫియాకు పండుగేనా?
సర్పంచులే భాగస్వాములా?
గ్రామాల రహదారులపై అక్రమ రవాణా రాజ్యమేలుతోంది!
నిజామాబాద్, జనవరి :
సాలూర మరియు బోధన్ మండలాల పరిధిలోని కోపర్గా, హంగర్గా, మంధర్నా, తెగేల్లి, మంజీరా ప్రాంతాల నుంచి యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా ప్రజల సహనాన్ని దాటిపోయింది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇసుక మాఫియా బహిరంగంగా దందా సాగిస్తుండగా, సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తున్నారు.

ఇందులో మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే—ఈ ఇసుక మాఫియాలో కొంతమంది నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు కూడా భాగస్వాములుగా ఉన్నారన్న వినికిడి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే దోపిడీకి దన్నుగా మారుతున్నారా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ఇసుక మాఫియాదారులకు కొంతమంది కిందిస్థాయి అధికారులు ముందస్తు సమాచారం అందిస్తూ సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ రవాణా జరుగుతున్నా చర్యలు లేకపోవడం వెనుక అధికారుల నిర్లక్ష్యమా? లేక మాఫియాతో మౌన ఒప్పందమా? అన్న ప్రశ్నలు ప్రజలను కలవరపెడుతున్నాయి.

రూరల్ ఎస్సై సెలవుపై వెళ్లిన అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పగలు–రాత్రి తేడా లేకుండా భారీ ట్రాక్టర్లు, ఆటోల ద్వారా ఇసుకను తరలిస్తూ, ముఖ్యంగా రాత్రి 10 గంటల తర్వాత మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక వాహనాల కారణంగా గ్రామీణ రహదారులు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని, ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిది? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్ శాఖలు కళ్లు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని, అధికారుల నిర్లక్ష్యమే ఇసుక మాఫియాకు అండగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు.
జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కోపర్గా, హంగర్గా. మంధర్నా, తెగేల్లి, మంజీరా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి, మాఫియా వెనుక ఉన్న అసలు సూత్రధారులపై కేసులు నమోదు చేయాలని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
మరి పై అధికారులు నిజంగా చర్యలు తీసుకుంటారా?
లేక మాఫియాకు తొత్తులుగా మిగిలిపోతారా?
అన్నది వేచి చూడాల్సిందే…
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....







