సాలూరలో ఇసుక మాఫియా స్కెచ్ ఫెయిల్?
ఆర్ఐపై దాడి వెనుక అసలు కుట్ర ఇదేనా!
సాలూర (బోధన్ రూరల్):
సాలూర మండలంలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారం తీవ్ర మలుపు తిరిగింది. సాలూర మండల ఆర్ఐ మెహరానంద్‌పై దాడి చేసేందుకు యత్నించిన ఘటనలో మందర్న గ్రామానికి చెందిన క్రాంతి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపారు. ఆర్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.
అయితే ఈ ఘటన వెనుక ఇసుక మాఫియా పథకం ఉందన్న ఆరోపణలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు సాలూరా బైపాస్ వద్ద కూర్చొని ఇసుక రవాణాకు వే బిల్లులు జారీ చేస్తూ వచ్చిన ఆర్ఐ విధానం మాఫియాదారులకు వరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. మంధర్నా నుంచి పెంటకుర్థ్, హుంస, కాజాపూర్ తదితర ప్రాంతాలకు ఇసుక అక్రమంగా తరలించేందుకు ఈ విధానం అనుకూలంగా ఉండేదని ఆరోపిస్తున్నారు.
అయితే ఇటీవల ఆర్ఐ నేరుగా మంధర్నా ఇసుక తోడే వద్దే కూర్చొని వే బిల్లులు ఇవ్వడం ప్రారంభించడంతో మాఫియా ప్లాన్‌కు బ్రేక్ పడిందని తెలుస్తోంది. దీంతో ఆర్ఐను భయపెట్టి మళ్లీ బైపాస్ వద్దే వే బిల్లులు ఇచ్చేలా చేయాలనే ఉద్దేశంతోనే దాడి చేయించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. “అనుకున్నది ఒకటి… జరిగింది మరొకటి” అన్నట్టుగా మాఫియా స్కెచ్ బోల్తా కొట్టిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
రూల్స్ ప్రకారం ఇసుక తోడే ప్రాంతంలోనే వే బిల్లులు జారీ చేయాల్సి ఉండగా, సాలూరా బైపాస్ వద్ద బిల్లులు ఇవ్వడం వల్ల మధ్యలో ఎక్కడైనా ఇసుక దింపుకోవడం, ఇతర ప్రాంతాలకు మళ్లించడం సులువుగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. ఇకపై సాలూర ఎమ్మార్వో మంధర్నా వద్దే వే బిల్లులు ఇస్తారా? లేక మళ్లీ బైపాస్ విధానానికే మొగ్గు చూపుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నిర్ణయంతోనే ఎవరు మాఫియాకు సహకరిస్తున్నారనే విషయం స్పష్టమవుతుందని స్థానికులు అంటున్నారు.
పరిమిషన్ లేఖల పేరుతో మరో దందా?
ఇక పరిమిషన్ లేఖల వ్యవహారంలోనూ తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయాలు, అభివృద్ధి పనుల పేరుతో లేఖలు తీసుకొని రోజుకు రెండు ట్రిప్పుల అనుమతితో బోధన్ పట్టణానికి ఇసుక తరలిస్తున్నారని, కానీ వాస్తవంగా నాలుగు నుంచి ఐదు ట్రిప్పులు కొట్టి అక్రమంగా ఇసుక అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం సాలూర ఎమ్మార్వోకు తెలిసినా మౌనం పాటిస్తున్నారని, మాఫియాదారులకు పుష్కలంగా మద్దతు లభిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొత్తానికి ఆర్ఐపై దాడి ఘటనతో సాలూర ఇసుక మాఫియా వ్యవహారం బయటపడుతుందా? లేక మళ్లీ మేనేజ్ అవుతుందా? అన్నది చూడాల్సి ఉంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








