గ్రామపంచాయతీ ఎన్నికలు నిష్పాక్షపాతంగా – భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని పోలీస్ కమిషనర్ ఆదేశాలు
నిజామాబాదు, డిసెంబర్ 06:
గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో, నిష్పాక్షపాతంగా నిర్వహించడం పోలీస్ యంత్రాంగం ప్రధాన బాధ్యతగా ఉండాలని నిజామాబాదు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఎస్‌హెచ్‌ఓలు, ఇతర పోలీస్ అధికారులతో సమావేశమై ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ—
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
ఎన్నికల నియమావళి అమలు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం తట్టుకోలేమని హెచ్చరిస్తూ, ఓటర్లను ప్రభావితం చేసే రీతిలో డబ్బు, మద్యం, ఇతర సామగ్రి రాకుండా చెక్‌పోస్టుల వద్ద ఇతర శాఖలతో కలిసి కఠిన తనిఖీలు చేపట్టాలని సూచించారు.
విజిబుల్ పోలిసింగ్, నాకబందీలు, ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగాలని ఆదేశించారు. గ్రామాలలో ఎస్‌హెచ్‌ఓలు, వీపీవోలు పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాలు పరిశీలించాలన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని, సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, ఉద్రిక్తతలకు దారి తీసే వ్యాఖ్యలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు.
లాడ్జీలు, గెస్ట్‌హౌసులు, కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్ వంటి ప్రదేశాల్లో తరచూ తనిఖీలు జరపాలని, అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఎన్నికల కార్యకలాపాల్లో పోలీస్ సిబ్బంది ఎలాంటి ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేస్తూ, నిబంధనలు ఉల్లంఘించినా క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తదుపరి— గత ఎన్నికల్లో వివాదాస్పద వ్యక్తులు, రౌడీషీటర్లను బైండోవర్ చేసి కౌన్సిలింగ్ నిర్వహించాలని, నామినేషన్ కేంద్రాల వద్ద పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని, వాహనాలు, అనుచరుల సంఖ్య నియమాల పరిమితుల్లో ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. కేంద్రాల లోపల మరియు బయట సీసీ కెమెరా పర్యవేక్షణ తప్పనిసరిగా అమలు చేయాలని కూడా చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీ బస్వా రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలము, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేశ్, ఎలక్షన్స్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీ వీరయ్య, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








