– నసురుల్లాబాద్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు
– ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాన్సువాడ కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి
– బాలల శ్రేయస్సును, హక్కులను గుర్తించే గొప్ప సందర్భం అని అభివర్ణన
– విద్యార్థులు బాల్యం నుండే తమ జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలని పలు సూచనలు
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ గిరిజన బాలుర సంక్షేమ గురుకుల విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి బాన్సువాడ కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి భార్గవి మాట్లాడుతూ “నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు”అని అభివర్ణించారు. బాలల దినోత్సవం అనేది ప్రతిచోటా బాలల శ్రేయస్సును మరియు హక్కులను గుర్తించి మద్దతు తెలియజేసి ప్రత్యేక సందర్భం అని అన్నారు. వివిధ దేశాలలో వేరువేరు తేదీలలో జరుపుకునే ఈ ప్రత్యేకమైన రోజు యువతరాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవడం ఎంత కీలకమో తెలియజేస్తుందన్నారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పిల్లల అభివృద్ధి మరియు విద్య కొరకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. దీని ఫలితంగా ఆయనను గౌరవిస్తూ భారత ప్రభుత్వం నవంబర్ 14వ తేదీన వారి పుట్టినరోజున బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను పెంచే విధానం దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులందరూ ప్రణాళికాబద్ధంగా సమయపాలన పాటిస్తూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు. అలాగే ప్రతి పౌరుడికి న్యాయవ్యవస్థ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కోరారు.. ప్రతి విద్యార్థి చిన్నప్పటినుండే తమ జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని నెరవేర్చుకుని సమాజంలో తమ తల్లిదండ్రులకు మరియు విద్యాబుద్ధులు బోధించే గురువులకు గొప్ప పేరును సంపాదించి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ రాహుల్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి,AGP లక్ష్మీనారాయణ మూర్తి, సీనియర్ అడ్వకేట్స్ ఖలీల్, అహ్మద్, మొగులయ్య , పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








