Post Views: 80
నిజామాబాద్, 20 అక్టోబర్ (వి1 న్యూస్) : నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్ ఘటనపై జిల్లా సీపీ సాయిచైతన్య కీలక విషయాలు వెల్లడించారు. రియాజ్ ఆసుపత్రిలో పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడి, వారి తుపాకీ లాక్కుని కాల్పులకు యత్నించడంతోనే ఈ ఘటన జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
ఘటన వివరాలు సీపీ మాటల్లో…
సీపీ సాయిచైతన్య తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం ఉదయం రెగ్యులర్ చెకప్‌లో భాగంగా విధుల్లో ఉన్న ఆర్.ఐ. (రిజర్వ్ ఇన్‌స్పెక్టర్) రియాజ్ ఉన్న వార్డు వద్దకు వెళ్లారు. అప్పుడు రియాజ్ వార్డులోని తలుపు, అద్దం పగులగొడుతున్న శబ్దం ఆర్.ఐ.కి వినిపించింది. వెంటనే ఆర్.ఐ. సిబ్బందికి సమాచారం అందించగా, ఆయనతో పాటు ఎస్సై, కానిస్టేబుల్ వార్డులోకి వెళ్లారు. రియాజ్ హంగామా సృష్టిస్తుండడంతో, అతడిని శాంతపరిచి బెడ్ వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితుడు రియాజ్, కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీని లాక్కుని, సిబ్బందిపైకి గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కేందుకు ప్రయత్నించాడు.
తప్పనిసరి కాల్పులు: రియాజ్‌ను ఆర్.ఐ. వారించినా ఫలితం లేకపోయింది. నిందితుడు తుపాకీని ఉపయోగించే ప్రమాదం పొంచి ఉండడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్.ఐ. రియాజ్‌పై కాల్పులు జరిపారు. దీంతో నిందితుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని సీపీ వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని సీపీ స్పష్టం చేశారు.
గాయపడిన వ్యక్తికి చికిత్స: రియాజ్ దాడిలో గాయపడిన ఆసిఫ్ అనే వ్యక్తిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించినట్లు సీపీ పేర్కొన్నారు.
Author: మీ వి1 న్యూస్ సీఈవో పేండ్కర్ శ్రీనివాస్
వి1 న్యూస్ పత్రిక, ఛానల్ లో పని చేయుటకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల, మండలాల పాత్రికేయలు కావలెను. సంప్రదించాల్సిన నంబర్లు : 9603925163 - 9834485832








