– ఆదిలోనే బీటలు వారిన వైనం అధికారుల పర్యవేక్షణ లోపం
– మూన్నాళ్ళకే పెచ్చులూడి పడతాయంటూ అసహనం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు
– పగుళ్లను రంగులతో, పిఓపి పనులతో కప్పిపుచ్చుతున్న గుత్తేదారు
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులు నాణ్యతలోపంతో నిర్వహిస్తున్నారు. నిధులు పుష్కలంగా ఉండడంతో పనులను వేగవంతం చేసిన గుత్తేదారు నిర్ణీత గడువు కంటే ముందే భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. గోడలకు స్లాబ్ కు మెరుగ్గా క్యూరింగ్ చేయాల్సి ఉండగా వాటిని మరిచి పనులను ఆఘమేగాలపై పూర్తి చేశారు. భవన నిర్మాణ పనులను రూ. కోటి 43 లక్షలతో ప్రారంభించి ఏడాది పూర్తి అవుతుంది. అయితే సంబంధిత శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలన పనులు నాణ్యతలోపంతో జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు
*పగుళ్లను కప్పిపుచ్చి.. పై మెరుగులతో అలంకరణ*
ఆరోగ్య కేంద్రం పనులు నాణ్యతలోపంతో నిర్మాణం చేపట్టడం వలన గోడలు, స్లాబు బీటల్ వారి దర్శనమిస్తున్నాయి. గోడలకు క్యూరింగ్ సరిగ్గా చేయకపోవడంతో ఎక్కడికక్కడ పగుళ్లు ఏర్పడి కనబడుతున్నాయి.. అయితే ఈ పగుళ్లను పైకి కనబడకుండా సంబంధిత గుత్తేదారు లప్పం, పిఓపి పనులు చేయించి తప్పులు కనబడకుండా కప్పిపుచ్చుకుంటున్నారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా జరగడంతో ఈపాటికి సగానికి ఎక్కువ బిల్లులు గుత్తేదారుకు అంది ఉంటాయని పలువురు చర్చించుకుంటున్నారు. నాసిరకంగా నాణ్యత లోపంతో పనులు జరిగినా కూడా మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్న అధికారులు బిల్లులను రికార్డులో పొందుపరిచి మంజూరు చేసినట్లు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. సుదీర్ఘకాలం పాటు మన్నికగా ఉండి ప్రజల సేవకు ఉపయోగపడాలని మంచి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక నిధులు కేటాయించి నిర్మిస్తున్న ప్రభుత్వ ఆస్తులను ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








