– ప్రకృతి ఒడిలో గుడి నిర్మాణం లేకుండా కొలువైన కొచ్చేరు మైసమ్మ అమ్మవారు
– ఆషాడ మాసంలో బోనాలు సమర్పించి, వన భోజనాలు నిర్వహణ
– దాదాపు వంద సంవత్సరాలు చరిత్ర కలిగినట్లు గ్రామస్తుల సమాచారం
– ఆటపాటలతో ఉత్సాహంగా మొక్కులు చెల్లింపు
– ఆలయ కమిటీ సభ్యులు పెర్క శ్రీనివాస్
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో ప్రకృతి ఒడిలో, పచ్చని పంట పొలాల మధ్యలో గుడి నిర్మాణం లేకుండా దాదాపు అర ఎకరం విస్తీర్ణంలో గల మర్రి చెట్టు కింద కొచ్చేరు మైసమ్మ తల్లి దేవత కొలువు దీరి ఉన్నది. ఆషాడ మాసం సందర్భంగా గురువారం రోజు మైలారం గ్రామ ప్రజలు అందరూ నూతన వస్త్రాలను ధరించి బంధుమిత్రులతో కలిసి సర్వాంగ సుందరంగా బోనాలను అలంకరించి.. అమ్మవారికి ఓడి బియ్యం, బోనాలు, నైవేద్యం సమర్పించి తమ మొక్కలను చెల్లించుకున్నారు. ఈ క్రమంలో వారు గ్రామంలో నుండి డప్పులు, డీజే చప్పుల్లతో పెద్దలు, యువకులు, మహిళలు ఆట, పాటలతో ఆనందోత్సాహాలతో ఊరేగింపు గా వెళ్లి అమ్మవారి సన్నిధిలో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పెర్క శ్రీనివాస్ మరియు సాయిరాం యాదవ్ మాట్లాడుతూ దాదాపు 100 సంవత్సరాల చరిత్ర గల ఎంతో మహిమాన్వితమైన అమ్మవారు కొచ్చేరు మైసమ్మ తల్లి అని తెలిపారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో పౌర్ణమి అనంతరం మొదటి గురువారం రోజు అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటామని తెలిపారు. మరుసటి రోజు శుక్రవారం అమ్మవారి సన్నిధిలో మేకలను బలిచ్చి బంధువులను ఆహ్వానించుకుని వన భోజనాలు నిర్వహించుకుంటామని తెలియజేశారు. ఇది గ్రామంలో ఆనవాయితీగా తరతరాలుగా కొనసాగుతుందని పేర్కొన్నారు. మైలారం గ్రామ ప్రజలు ఏ శుభకార్యం తలపెట్టినా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే మొదలు పెడతారని తెలిపారు. అమ్మవారి సన్నిధిలో ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజు పొరుగు జిల్లాలు మరియు రాష్ట్రాల నుండి నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. అమ్మవారు భక్తుల పాలిట కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతుందని అభివర్ణించారు. భక్తుల రాకపోకలతో ఆలయం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలతో పాడిపంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








