V1News Telangana

best news portal development company in india

మత్తు పదార్థాల నిర్మూలన కొరకు ప్రజలకు అవగాహన కార్యక్రమం…..

SHARE:

– కల్తీ కల్లు, మద్యం, గుట్కా, జర్దా, ఇతర మత్తు పదార్థాలు కాలేయం, మూత్రపిండాలను దెబ్బతీస్తాయని వివరణ

– ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదని ప్రజలకు విజ్ఞప్తి

– మత్తు పదార్థాల వలన కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం

– పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ వహించాలని సలహాలు

– సైకాలజిస్ట్, డాక్టర్ .విశాల్

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని పలు గ్రామాలలో ఇటీవల కల్తీ కల్లు సేవించడం వలన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంఘటన పై నిజామాబాద్ కు చెందిన డాక్టర్. విశాల్ స్వచ్ఛందంగా గ్రామ ప్రజలకు కల్తీ కల్లు, గుట్కా, జర్దా, ఇతర మత్తు పదార్థాల వాడకం వలన కలిగే అనర్థాల గురించి చక్కగా వివరిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ కల్లు తయారీలో ఉపయోగించే రసాయనాలు, మద్యం సేవించడం వలన మరియు ఇతర హానికర మత్తు పదార్థాలు శరీరానికి ఎంతో హాని కలిగిస్తాయని, కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాల పనితీరును దెబ్బతీస్తాయని వివరించారు. గుట్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తులలో ఉండే నికోటిన్ ప్రజలను మత్తుకు వ్యసనపరుస్తుందని, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరించారు.

ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల మానసిక సమస్యలు, శారీరక వైకల్యాలు తలెత్తుతాయని, కుటుంబాలు ఆర్థికంగా, భౌతికంగా చిన్నాభిన్నం అవుతాయని అన్నారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని.. ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకోవాలంటే ఈ దురలవాట్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని డాక్టర్ విశాల్ సూచించారు. తల్లిదండ్రులు తమ విలాసాలకు ప్రాధాన్యతనిస్తూ పిల్లల జీవితాలను నిర్లక్ష్యం చేయడం వలన వారి జీవితాలు ప్రశ్నార్ధకంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని.. వారి భవిష్యత్తుపై శ్రద్ధ వహించాలని కోరారు. తద్వారా వారు భావిభారత పౌరులుగా తీర్చిదిద్దబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు డాక్టర్ విశాల్ సలహాలు, సూచనలను శ్రద్ధగా ఆలకించారు.మత్తు పదార్థాల వల్ల కలిగే హానికర ప్రభావాల గురించి ప్రతి ఒక్కరు తమ ఇరుగు పొరుగు ప్రజలకు అవగాహన కల్పించి సమాజంలో మార్పు తీసుకురావాలని అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యాల సంతోష్, ఉల్లెంగ కిరణ్, బాలయ్య, ఉల్లెంగ రాములు, అల్లం చిన్న బందయ్య, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india