అనుమతులు, ఫీజుల నిర్మాణంపై విద్యాశాఖ దృష్టి సారించాలని బీడీఎస్ఎఫ్ డిమాండ్
బోధన్, జూన్ 9 (వి1 న్యూస్): జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వహణ, ఫీజుల వసూళ్లు, అనుమతుల అంశాలపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (బీడీఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు సంజయ్ తలారి డిమాండ్ చేశారు.
మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఐఐటీ, జేఈఈ, నీట్ ఫౌండేషన్, ఒలింపియాడ్, ఇంటర్నేషనల్ స్కూల్ వంటి ఆకర్షణీయ పేర్లతో కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల అడ్మిషన్లను పెంచుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేక కోచింగ్, ర్యాంకుల హామీలు, అంతర్జాతీయ స్థాయి విద్య పేరుతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నప్పటికీ, ఆయా సంస్థలు అవసరమైన అనుమతులు, ప్రమాణాలను పూర్తిగా పాటిస్తున్నాయా అనే విషయంపై స్పష్టత అవసరమని అన్నారు.

విద్యార్థులకు ప్రతిరోజూ పరీక్షలు, అదనపు కోచింగ్ తరగతులు నిర్వహించడం వల్ల చిన్నారులపై మానసిక ఒత్తిడి పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అడ్మిషన్, ట్యూషన్, రవాణా, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పేరుతో అధిక ఫీజులు వసూలు చేయడం వల్ల మధ్యతరగతి, బహుజన కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.

జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల అనుమతులు, మౌలిక సదుపాయాలు, ఫీజుల నిర్మాణం, ప్రకటనల అంశాలపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ నిర్వహించాలని కోరారు. అనుమతులు లేని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యను వ్యాపారంగా మార్చే ధోరణిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్య అందకుండా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంజయ్ తలారి కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








